You might be interested in:
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదలకానుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవ్వడంతో ఈనెలాఖరు లేదా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెగా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న బీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంత్రి సవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పుకచ్చారు. ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ కోచింగ్ పొందవొచ్చునన్నారు.
అర్హులు
బీసీ, ఈబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు
అభ్యర్థులు ఖచ్చితంగా టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి
ఎంతమందికైనా ఆన్ లైన్ ద్వారా ఉచిత శిక్షణివ్వడానికి ప్రభుత్వం సిద్ధం
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి సవిత తెలిపారు.
బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్
మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లాలోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించబోతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. త్వరలో ఆన్ లైన్ లోనూ ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థుల కోసం త్వరలో శిక్షణా తరగతులు ప్రారంభించబోతున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు బీసీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని... ఎంఎస్ఎంఈ, ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాది కోసం సబ్సిడీ రుణాలు కూడా అందించనున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ అభ్యున్నతి కోసం ఒక వైపు విద్యకు, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి శిక్షణ, ఇంకో వైపు ఆర్థిక చేయూత కలిగేలా స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
0 comment