You might be interested in:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కొటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.అయితే, తాజాగా ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కలెక్టర్లు భవిష్యత్తును ఊహించుకొని పనిచేయాలని అన్నారు. కలెక్టర్ గా ఉన్న సమయంలో చేసే పనులవల్ల ఇమేజ్ శాశ్వతంగా ఉంటాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేశారు.
మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు చొప్పున అందజేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాలుగు వందలతో ప్రారంభించిన పింఛన్‌ను నాలుగు వేలకు చేశామని, దేశంలో ఎక్కడ లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 204 అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేశామని, దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఒక సిలీండర్ ఉచితంగా ఇచ్చామని, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని, చెత్త పన్ను రద్దు చేశామని, బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10శాతం రిజర్వేషన్ ఇచ్చామని, చేనేతలకు జీఎస్టీ రద్దు చేశామని చంద్రబాబు చెప్పారు.
రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోనూ ఈ తరహా మోడల్స్‌ను చేపట్టాలన్నారు. నేషన్ హైవేస్ కు 55 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, 75 వేల కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పనులు మాకు సంబంధం లేదని కలెక్టర్లు అనుకోకూడదని చంద్రబాబు సూచించారు.
0 comment