Job Fair: జేఎన్‌టీయూలో జాబ్‌ఫెయిర్‌ కు పోటెత్తిన నిరుద్యోగులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Job Fair: జేఎన్‌టీయూలో జాబ్‌ఫెయిర్‌ కు పోటెత్తిన నిరుద్యోగులు

You might be interested in:

Sponsored Links

 జేఎన్‌టీయూలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌ఫెయిర్‌కు నిరుద్యోగులు పోటెత్తారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా నిరుద్యోగులురావడంతో వర్సిటీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వచ్చిన వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జేఎన్‌టీయూ అధికారులు విఫలమయ్యారు. యూనివర్సిటీలో నిపుణ-సేవా ఇంటర్నేషనల్‌ సహకారంతో మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి జాబ్‌ ఫెయిర్‌ ప్రారంభమవుతుందని ప్రకటించిన నిర్వాహకులు 11 గంటలు దాటినా లోనికి అనుమతించకపోవడంతో క్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్‌ (సీఆర్‌సీ) ముందు తొక్కిసలాట జరిగింది. జాబ్‌ఫెయిర్‌కు ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రావడం ఆలస్యమైంది. ఆయన వచ్చే వరకు సీఆర్‌సీ గేట్లను సిబ్బంది తెరవలేదు. అక్కడే రెండు గంటల పాటు నిల్చున్న నిరుద్యోగులు ఎండను తట్టుకోలేకపోయారు. మరోవైపు గుంపులో ఉన్నవారికి ఊపిరాడకపోవడంతో ఒకర్నొకరు తోసుకున్నారు. ఈలోగా గేటు తెరవడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు.

అక్కడున్న పోలీసులు వారిని లాఠీలతో వెనక్కి నెట్టడంతో నిరుద్యోగులు కొందరు కిందపడిపోయారు. ఈ పరిస్థితిని చూసి వందలాది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. నిరుద్యోగులు వేచి ఉండేందుకు (క్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్‌ ఎదుట) కనీసం టెంట్లు గానీ, తాగునీటి సదుపాయం గానీ ఏర్పాటు చేయని వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం పట్ల పలువురు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్‌ ఫెయిర్‌కు 52 వేల మంది రాగా, 3,618 మందికి ప్లేస్‌మెంట్లు ఖరారయినట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా మెగా జాబ్‌ ఫెయిర్‌ను వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాలను పెంపొందించడంపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్‌ జాబ్‌ ఫెయిర్‌లోని స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు, రెక్టార్‌ విజయకుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE