You might be interested in:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దిశగా అడు గులు వేస్తోంది. ఉద్యోగుల అంశం తో సహా సూపర్ సిక్స్ అమలు దిశగా మంత్రివర్గ భేటీలో చర్చ చేసి.. నిర్ణయం తీసుకోనుంది. కొత్త ఏడాది ప్రారంభం వేళ ఉద్యోగాల భర్తీ .. సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ఖరారు దిశగా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా ఉద్యోగులకు పెండింగ్ డీఏల తో పాటుగా కొత్త పీఆర్సీ కమీషన్ ఏర్పాటు పైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల కోసం
రేపు (బుధవారం) ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాల కు ఆమోద ముద్ర వేయనున్నారు. ఉద్యోగులతో పాటుగా మహిళలు, రైతులకు సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయాలు ఉంటాయని సమాచారం. ఉద్యోగులకు డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమావేశంలో ఒక డీఏ విడుదలకు ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్దం అయింది. అదే విధంగా పీఆర్సీ కమిషన్ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ కూటమి అధికారంలోకి రాగానే రాజీనామా చేసింది. దీంతో, కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది.
పథకాలకు ఆమోదం
అదే విధంగా కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఉగాది నుంచి అమలుకు నిర్ణయించారు. ఇదే సమయంలో రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలు షెడ్యూల్ ను ఈ భేటీలో ఖరారు చేస్తారని సమాచారం. ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల నుంచి ముందుగా తల్లికి వందనం, లేదా రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు పథకాల్లో ఎప్పుడు ఏది అమలు చేయాలనేది ఈ కేబినెట్ భేటీలో చర్చించి .. కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
0 comment