You might be interested in:
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(Indian Air Force)లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల అగ్నిపథ్ ఎయిర్ అగ్నివీర్ (Agniveer jobs) ఇంటెక్ 02/2025 బ్యాచ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఇన్‌టేక్ బ్యాచ్ 2025లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 7 నుంచి వీటికి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అయితే దీనికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎంత జీతం వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం పెళ్లికాని పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నిపథ్ పథకం కింద ఈ రిక్రూట్‌మెంట్ నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ వ్యవధి తర్వాత 25 శాతం మందికి ఎయిర్ ఫోర్స్‌లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వబడతాయి. ఈ పరీక్ష మార్చి 22, 2025న నిర్వహించబడుతుంది. దీని కోసం దరఖాస్తు చేసేందుకు జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 550 ఫీజుగా నిర్ణయించారు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ అభ్యర్థుల కనీస వయస్సు 17.5 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
ఎలాంటి చదువు ఉండాలి
10+2/గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్లంతో ఇంటర్మీడియట్ లో కనీసం 50% మొత్తం మార్కులు, ఆంగ్లంలో 50% స్కోర్ ఉండాలి
లేదా
సంబంధిత విభాగంలో 50% మొత్తం మార్కులతో ఇంజనీరింగ్‌లో డిప్లొమా, ఆంగ్లంలో 50% మార్కులు ఉండాలి
లేదా
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో ఒకేషనల్ కోర్సు, కనీసం 50% మొత్తం మార్కులు, ఆంగ్లంలో 50% స్కోర్ ఉండాలి
జీతం ఎంత ఉంటుంది?
ఇందులో ఎంపికైన యువతీయువకులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రూ. 48 లక్షల జీవిత బీమా అందిస్తారు. ఇది కాకుండా అగ్నిపథ్ స్కీం ద్వారా ఇతర అనేక ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు మొదటి ఏడాదిలో నెలకు రూ.30,000, రెండో సంవత్సరంలో రూ.33,000, మూడో సంవత్సరంలో రూ.36,500, చివరిగా నాలుగో సంవత్సరంలో నెలకు రూ. 40,000 అందజేస్తారు. ఇలా ఎంపికైన యువత తక్కువ వయస్సు నుంచే మంచి వేతనాన్ని పొందవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ (https://agnipathvayu.cdac.in/avreg/candidate/login) లేదా నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
0 comment