You might be interested in:
మరో 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం అయిందని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం రాగానే వెంటనే 25 వేల పోస్టులతో వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆరు నెలల్లోనే 90 శాతం వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ చేసేవరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని.. ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. రాబోయే సమావేశాల్లో చట్టం చేస్తే వర్గీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. వర్గీకరణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. వారందరి అనుమానాలను నివృత్తి చేస్తామని.. ఆ బాధ్యత మాదేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి తలరాతలు మారుతాయని భావించినట్లుగానే.. ఎస్సీ వర్గీకరణతో మాదిగలందరి తలరాతలు మారుతాయనుకోవడం పొరపాటేనని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల ఎవరి వాటా కింద వారికి అడ్మిషన్లు, ఉద్యోగాలు వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కానీ వంద శాతం ఒక్క వర్గానికే రావని.. మిగతా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత గురించి కూడా ఆలోచించాలన్నారు. ఈ పోటీ ప్రపంచంలో మన ఆలోచనలో మార్పు రావాలని.. ఇప్పుడైనా మేలుకోకపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు.
0 comment