You might be interested in:
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. EBC (ఎకనామికలీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) వారికి 100 శాతం రాయితీతో రూ.50,000 వరకు రుణం అందిస్తోంది.
అంటే, ఈ మొత్తాన్ని తీసుకున్న వారు, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు పెద్ద అవకాశం లభిస్తోంది. ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ https://tgobmmsnew.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
ఎంత రుణం - ఎంత రాయితీ:
ఈ పథకంలో రుణాలు ఎంత తీసుకుంటే ఎంత రాయితీ లభిస్తుందో కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఒక లక్ష రూపాయల లోపు రుణం తీసుకుంటే, 90 శాతం రాయితీ ఇస్తారు. అంటే, రూ.1,00,000 రుణం తీసుకుంటే, లబ్ధిదారుడు కేవలం రూ.10,000 మాత్రమే తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య రుణం తీసుకుంటే, 80 శాతం రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు, రూ.2,00,000 రుణం తీసుకుంటే, రూ.40,000 చెల్లిస్తే చాలు.
రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల లోపు రుణాలకు 70 శాతం రాయితీ ఉంటుంది. అంటే, రూ.4,00,000 రుణం తీసుకుంటే, రూ.1,20,000 తిరిగి చెల్లించాలి. ఈ విధంగా రుణ రాయితీలు యువతకు స్వయం ఉపాధిని సులభతరం చేస్తాయి.
వారందరికీ రుణాలు:
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఈ రుణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా ఈబీసీ వర్గాల యువతకు అందుబాటులో ఉంటాయి. చిన్న దుకాణాలు, సర్వీస్ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది.
తేలికగా దరఖాస్తు:
దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉండేలా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అర్హత కలిగిన వారు వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
ఈ రుణాలు మంజూరు చేసేందుకు ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఎంపికైన వారికి జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణ మంజూరు పత్రాలు ఇస్తారు. ఈ పథకం ద్వారా యువత ఆర్థికంగా స్వతంత్రులు కావడమే కాక, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా ఏళ్లుగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదు అంటూ.. ఎన్నికల ఏడాదిలో చాలా ఆందోళనలు కూడా జరిగాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్.. తామే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. ఐతే.. ప్రజలు ఇది నమ్మనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. కాంగ్రెస్ గెలిచింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. చిన్నవో, పెద్దవో.. మొత్తానికి క్రమంగా ఖాళీలను భర్తీ చేస్తోంది. అలాగే.. రుణాలు ఇప్పించడం ద్వారా సొంత వ్యాపారాలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తోంది. ఇలాంటి విధానాన్ని ఇదివరకు కేటీఆర్ కూడా సమర్థించారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావనీ, ప్రైవేట్ ఉద్యోగాలు లభించేలా తాము అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ.. మరోవైపు రుణాలు ఇప్పించడం ద్వారా ప్రైవేట్ వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది. మొత్తంగా ఇది యువతకు మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుంటే.. కెరీర్‌ని మలుపు తిప్పుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు
0 comment